Indian cricket history

cricket-history-1-2.gif

Posted: 01/28/2012 06:00 PM IST
Indian cricket history

world-cup-2011ఇంగ్లాండ్ లో పుట్టిన క్రికెట్ ఆట వాళ్ళు పాలించిన దేశాల్లోకి కూడా పాకింది. భారతదేశంలోకి కూడా ఆ విధంగా వచ్చిన ఆటే ఇది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, బ్రిటిష్ వారు పాలించిన దేశాల్లోనే ఇది ఇంకా మిగిలివుంది. ఇంగ్లాండ్ తో పాటుగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కవగా ప్రాచుర్యాన్ని పొందింది. ప్రపంచంలోని ఇతర ప్రముఖ క్రీడలైన టెన్నిస్, బాట్మింటన్, ఫుట్ బాల్, వాలీ బాల్ ఆటలను కూడా భారత్ లో ఆడతారు కానీ, క్రికెట్ కి ఉన్న పిచ్చి మరే ఆటకూ ఇక్కడ లేదు. టివి లు రాకముందు రేడియోలో వచ్చే క్రికెట్ కామెంటరీ వినటానికి వాటికి అతుక్కుపోయేవారు. మొదట్లో ఇంగ్లీషులోనే చెప్పిన కామెంటరీ బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత హిందీలో కూడా ప్రత్యక్ష వ్యాఖ్యానాలు రావటం మొదలుపెట్టాయి. టివిలు వచ్చి సంకేతిక నైపుణ్యం బాగా పెరిగిన తర్వాత ఈ ఆట మీద పిచ్చి ఇంకా పెరిగిపోయింది.

దీనిమీద ఉన్న ఉత్సాహాన్ని తగ్గిపోకుండా చూస్తున్న క్రికెట్ బోర్డు విధానాలు కూడా ఇందుకు కారణమే. 5 రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్ లకు ఆదరణ తగ్గిపోతున్న సమయంలో ఒన్ డే మ్యాచ్ లు, ఫిక్స్డ్ ఓవర్ల మ్యాచ్ లూ, డే అండ్ నైట్ మ్యాచ్ లూ వచ్చాయి. భారత్ లోని క్రికెట్ నియంత్రణ సంస్థ (బిసిసిఐ) ప్రపంచంలోనే ఇతర క్రీడా సంస్థలతో పోల్చి చూస్తే అతి సంపన్నమైన సంస్థ. 1929 నుంచీ పని చేస్తున్న ఈ క్రికెట్ నియంత్రణ సంస్థ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత జట్టు ఎక్కడెక్కడ ఆడాలి, వారి పర్యటన వివరాలు ఇవన్నీ ఐసిసి నిర్ణయిస్తుంది. కానీ సంపదగల సంస్థ అవటం వలన బిసిసిఐ తన మాట నెగ్గించుకుంటుంది. ఐసిసి నిర్ణయానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జింబాబ్వేల స్థానంలో ఎక్కువ ఆదాయం వచ్చే గ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా దేశాలకు క్రీడా పర్యటనలను పెంచుకోగలిగింది. స్పాన్సర్ షిప్ విషయంలో కూడా తన మాట నెగ్గించుకోగలుగుతుంది. బిసిసిఐ సెలక్షన్ కమిటీలో ఐదు జోన్లలోంచి ఎంపికచెయ్యటానికి ఐదుగురు ఎంపికచేసేవారుంటారు. అందులో ఒకరు చైర్ మన్ గా వ్యవహరిస్తారు. సెలక్షన్ కమిటీకి ప్రస్తుతమున్న చైర్మన్ కృష్ణమాచార్య శ్రీకాంత్. ఇతర సభ్యులు- యశ్పాల్ శర్మ, నరంద్ర హిర్వాణీ, సురేంద్ర భావే, రాజా వెంకట్.

ranjit-singhక్రికెట్ ఆట మన దేశానికి 1700 వ సంవత్సరంలో వచ్చింది. బ్రిటిష్ వారు ఎక్కడి పోయినా మాట్లాడటానికి వీలుగా తమ భాషను ప్రచారం చేసారు, రవాణా కోసం వాహనాలను, యుద్ధాలలో ఉపయోగపడటానికి మందుగుండ్లను పట్టుకొచ్చారు, అలాగే తమ ఆటలను కూడా అన్నిచోట్లా ప్రవేశపెట్టారు. 1721 లో భారతదేశంలో మొదటి క్రికెట్ మ్యాచ్ ఆడారు. 1848 లో పార్శీ సమాజంవారు ఓరియంటల్ క్రికెట్ క్లబ్ అనే పేరుతో బొంబాయిలో ఒక సంస్థను స్థాపించారు. మొదట్లో పట్టించుకోకపోయినా నెమ్మదిగా 1877 కల్లా బ్రిటిష్ వారు భారతీయులతో ఆడటం మొదలుపెట్టారు. 1912 నుంచి బొంబాయిలోని పార్శీలు, సిక్కులు, హిందువులు, ముస్లింల జట్లతో బ్రిటిష్ వారు ప్రతి సంవత్సరం మ్యాచ్ ఆడటం మొదలుపెట్టారు. అయితే అంతకు ముందు కొందరు భారతీయులు ఇంగ్లాండ్ తరఫున ఆడటానికి పోయేవారు. అందులో రణజీత్ సింహ్, దులీప్ సింహ్ ల ఆటను బ్రిటిష్ వారు బాగా మెచ్చుకునేవారు. అందుకే వారి పేర్ల మీద భారత దేశంలో జరిగే రెండు పెద్ద టోర్మమెంట్లకు రంజిత్ ట్రోఫీ, దులీప్ ట్రాఫీ అని వారి పేర్లు పెట్టారు.

1911 లో మొదటిసారి భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడింది కానీ ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ తో కాదు- ఇంగ్లీషు కౌంటీ టీమ్ లతో. 1926లో భారత జట్టుని ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. 1932లో సికె నాయుడు నేతృత్వంలో టెస్ట్ క్రికెట్ ఆడే దేశంగా భారత్ గుర్తింపుని పొందింది. అది అప్పుడు ఆడింది మూడు రోజులే అయినా దానికి టెస్ట్ మ్యాచ్ హోదానిచ్చారు. అయితే ఆ సమయంలో భారత జట్టుకి క్రికెట్ మీద పరిపక్వత కానీ పట్టు కానీ రాలేదు. 1948 లో సర్ డోనాల్డ్ బ్రాడ్ మన్ నేతృత్వంలో ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఇన్విన్సిబుల్ తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడి 4-0 స్కోర్ తో ఓడిపోయింది.

భారత్ జట్టు విజయాన్ని చవిచూసింది 1952లో. ముందు ఇంగ్లండ్ మీద మద్రాస్ లో ఆడిన మ్యాచ్ లో గెలిచిన భారత్, అదే సంవత్సరం మొదటి టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ మీద గెలిచింది. ఆట నైపుణ్యాన్ని బాగా పెంచుకుని 1956లో న్యూజిలాండ్ మీద సిరిస్ గెలిచినా ఆ తర్వాత కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ముందు నిలవలేకపోయింది. ఆ తర్వాత బాగా పుంజుకుని, ఇండియాలో ఆడిన ఆటల్లో 1961-62 లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్ తో ఒక హోమ్ సిరిస్ లో గెలుపొందింది. ఆ తర్వాత 1967-68 లో విదేశాల్లో ఆడిన టెస్ట్ లలో న్యూజిలాండ్ మీద గెలుపొందింది. 1970 వచ్చేసరికి భారత్ జట్టులో బిషన్ సింగ్ బేడి, ఇఏఎస్ ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, శ్రీనివాస వెంకటరాఘనన్ లాంటి మంచి బౌలర్లు, సునీల్ గవాస్కర్, విశ్వనాథ్ లాంటి మెరికలాంటి బ్యాట్స్ మన్ భారత్ కి పేరు తెచ్చారు.

1971లో ఒన్ డే మ్యాచ్ లు వచ్చి క్రికెట్ అభిమానుల సంఖ్య గణనీయంగా పెంచేసింది. కానీ భారత్ జట్టు మాత్రం మారిన ఆటకు అనుగుణంగా తన ఆటను మార్చుకోలేకపోయింది. ఒన్ డే మ్యాచ్ లో పరుగులకే కాకుండా స్కోర్ రేటు కి కూడా ప్రాముఖ్యతవుంటుంది. కానీ భారత్ జట్టు టెస్ట్ మ్యాచ్ లపద్దతిలో ఆడేసరికి నిలవలేకపోయారు.

world-cup-19831980 కి వచ్చేసరికి భారత్ జట్టు మొహమ్మద్ అజరుద్దీన్, దిలీప్ వెంగసర్కర్, రవి శాస్త్రి ల వలన టీం ప్రతిభను పెంచుకుని, 1983 లో ప్రపంచ కప్ ని సాధించుకుంది. 1984 లో ఆసియా కప్ ని, 1985 లో ఆస్ట్రేలియాలో వర్ల్ డ్ ఛాంపియన్ షిప్ ని సంపాదించుకుంది. గవాస్కర్ కపిల్ దేవ్ లు 1980 లో భారత్ క్రికెట్ జట్టుని పెద్ద ఎత్తులకు తీసుకుని పోయారు. గవాస్కర్ 34 సెంచరీలు చేసి 10000 పరుగుల రికార్డ్ ను చేపట్టగా, కపిల్ దేవ్ ఆల్ రౌండర్ గా పేరుగాంచి, 434 వికెట్లు తీసుకుని రికార్డ్ సాధించారు. 1989, 1990 లలో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లేలు చేరటంతో భారత్ జట్టు మరింత రాణించింది. ఆ తర్వాత సంవత్సరంలో శ్రీనాథ్, అమర్ సింగ్ లు, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లు వచ్చి చేరారు.

2000 లో క్రికెట్ చరిత్రలో మచ్చ తెస్తూ, క్రికెట్ అభిమానులకు మనస్తాపాన్ని కలిగిస్తూ, అజరుద్దీన్, అజయ్ జడేజా లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలనెదుర్కుని క్రికెట్ నుంచి బహిష్కరించబడ్డారు.

2000 లో జాన్ రైట్ ని మొదటి విదేశీ క్రికెట్ కోచ్ గా నియమించిన తర్వాత క్రికెట్ టీం లో గణనీయమైన మార్పు వచ్చింది. 2001 లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మీద గెలిచి చూపించారు. అలాగే జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్ ల మీద టెస్ట్ మ్యాచ్ లు గెలుచుకున్నారు. మధ్యలో కాస్త ఢీలా పడ్డా, 2004 తర్వాత రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో మహేందర్ సింగ్ ధోనీ, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ లు రాజ్యమేలారు.

2005లో భారత్ జట్టు ఐసిసి ఒన్ డే ర్యాంకింగ్ లో రెండవ స్థానానికి చేరుకుంది. 2006లో టెస్ట్ సిరిస్ లో పోయినా, పాకిస్తాన్ తో ఒన్ డే మ్యాచ్ లలో వరసగా విజయం సాధించింది. 2006 లో సౌత్ ఆఫ్రికా మీద మొదటిసారిగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో గెలిచింది. 2007లో వర్ల్ డ్ కప్ కి ముందు వరసగా ఒన్ డేల ను కొల్లగొట్టింది. 2007 లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ట్వంటీ ట్వంటీ వర్ల్ డ్ కప్ లో విజయం సాధించింది.

2009 లో శ్రీలంక మీద 2-0 తో గెలుపొందిన తర్వాత భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. అయితే మళ్ళీ 2011 లో ఇంగ్లాండ్ తో ఓడి మొదటి స్థానాన్ని పోగొట్టుకుంది. అయితే 2011 లో భారత్ మరో మెట్టు ఎక్కింది. అదే క్రికెట్ వర్ల్ డ్ కప్. 1983 తర్వాత మరోసారి వర్ల్ డ్ కప్ అందుకుని, రెండు సార్లు గెలిచిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్టులో చేరింది.

dhoniఇప్పటి వరకూ భారత్ క్రికెట్ ని కెప్టెన్ గా నడిపించినవారిలో 25 మ్యాచ్ లను లీడ్ చేసినవారు ఆరుగురు. కేవలం ఒన్ డే లకే కెప్టెన్ గావ్యవహరించినావుర ఐదుగురు. ఇండియా మొదటి కేప్టెన్ సి.కె.నాయుడు 1932లో. ఆ తర్వాత వరసగా లాలా అమర్ నాథ్, పటౌడీ నవాబ్, అజిత్ వాడేకర్, వెంకట రాఘవన్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగసర్కార్, కృష్ణమాచార్య శ్రీకాంత్, మొహమ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, మహేందర్ సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లేలు కెప్టెన్ లుగా వ్యవహరించారు.

woman-cricketభారత్ లో మహిళా క్రికెట్ టీమ్ కూడా ఉంది కానీ మగ ఆటగాళ్ళకున్న గుర్తింపు వారికి లేదు. 1976-77 లో మొదటిసారిగా మహిళా క్రికెట్ టీమ్ వెస్టిండీస్ జట్టుతో ఆడినప్పుడు ఆట డ్రా అయింది. 2004-05 లలో మిశ్రమ ఫలితాలతో ఆడింది.

క్రికెట్ ఆట లోనూ, నియంత్రణ సంస్థలోనూ చోటుచేసుకున్న అధిక మొత్తాల వలన క్రికెట్ ఆటగాళ్ళు ఆటపరంగా అభిమానులను సంపాదించుకోవటమే కాకుండా సెలబ్రిటీ హోదాలను కూడా పొందారు. దానితో వారికి వ్యాపార ప్రకటనలలోనూ సొమ్ము చేసుకునే అవకాశం లభించింది. అందుకే సినిమా తారలతో వారు పోటీ పడగలుగుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ec serves notices to candidates asking for bribes for election expenditure
Employee new tricks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles