టాక్స్ అనేది ప్రభుత్వం విధించేది కాబట్టి అది అన్నిచోట్లా ఒకేలా ఉండాలి. కానీ వ్యాట్ అని, సర్వీస్ టాక్స్ అని, సర్వీస్ ఛార్జెస్ అని పేర్లు పెట్టి రెస్టారెంట్లలో బిల్లు మీద 36 శాతం వరకు పెంచేసి వసూలు చెయ్యటమే కాకుండా ఒక్కో చోట ఒక్కో రేటుతో ఛార్జ్ చేస్తున్నారు!
దీనిసంగతి అడిగితే కంప్యూటర్ బిల్లు కదండీ అంటారు- మాకే పాపం తెలియదన్నట్లు! కంప్యూటర్ లో కూడా మనం ఫీడ్ చేసిందేగా వచ్చేది అని అంటే ఏమోనండి మేనేజ్ మెంట్ ని అడగాలి అంటారు. వినియోగదారులలో అధికశాతం దీన్ని పట్టించుకునే సమయం కానీ ఓపిక కానీ ఉండదు. మొత్తం మీద ఎంత చెల్లించాలని చూస్తారే కానీ దాని వివరాల్లోకి పోరు. ఎవరైనా అడిగినా వాళ్ళకి సరైన సమాధానం దొరకదు.
విశేష్ బృందం దీని సంగతేమిటో చూడాలని వివిధ రెస్టారెంట్లలకు పోయి చూడటం, ఆ బిల్లు కాపీలనే ఎటాచ్ చెయ్యటం జరిగింది.
అసలు సర్వీస్ టాక్స్ అంటే ఏమిటి?
వస్తువుల అమ్మకాల మీద సేల్స్ టాక్స్ ఉంటుంది. అలాగే వస్తు రూపేణా కాకుండా సేవల రూపంలో చేసే వ్యాపారం మీద కూడా ఫైనాన్షియల్ యాక్ట్ 1994 ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్నుగా వసూలు చెయ్యటానికి పూనుకుంది. అయితే దాన్ని సేవలందించేవారు కట్టవలసి వచ్చినా వాళ్ళు దాన్ని కస్టమర్ల నుంచే తీసుకోవటం వలన అది ఆ విధంగా పరోక్షంగా కట్టే పన్నుగా వినియోగదారుల మీద పడుతూ వచ్చింది. దీని పరిధిని విస్తృతం చేస్తూ 2012 లో బడ్జెట్ లో ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్లు, తాత్కాలికంగా బసచేసే విడుదులుగా ఉండే హోటళ్ళకూ వర్తింపజేయటం జరిగింది.
ఇది కేవలం సంవత్సరానికి రూ.10 లక్షలను మించిన ఆదాయం గల సేవలను అందించినవారు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను. ఈ పన్నును వ్యక్తిగత మైన సేవలందించినవారి కేసులో వారు నగదు రూపంలో అందుకున్న దానిమీద టాక్స్ ఉంటుంది. అదే సంస్థల విషయంలో అయితే నిజంగా చేసిన సేవల మీద అక్రూడ్ అమోంట్ మీద- అంటే బిల్లు వసూలు కాకపోయినా ఖాతాలో చూపించినదాని ప్రకారం వచ్చిన సంపాదన మీద టాక్స్ చెల్లించవలసివుంటుంది.
చెల్లించవలసింది వ్యాపారైనా, దాన్ని విడిగా వినియోగదారుల దగ్గర్నుంచి వసూలు చెయ్యటం సంస్థలకు పరిపాటిగా మారిపోయింది. వ్యక్తిగత హౌదాలో సేవలందించేవారు వసూలు చేసిన నగదు సొమ్ము మీద సర్వీస్ టాక్స్ కట్టవలసివుంటుంది. వాళ్ళు విడిగా సర్వీస్ టాక్స్ ఇవ్వమని కస్టమర్లను అడగరు. కానీ సంస్థలు మాత్రం సర్వీస్ టాక్స్ విడిగా తీసుకుంటున్నాయి. దాన్ని ఒకవేళ ప్రభుత్వానికి జమకట్టకపోతే జవాబుదారీ మాత్రం వాళ్ళదేననుకోండి! సర్వీస్ టాక్స్ తీసుకుని ప్రభుత్వానికి చెల్లించటం లేదని, అటువంటి వారిమీద కఠిన చర్యలుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం డిసెంబర్ 2013 లో హైద్రాబాద్ కి వచ్చి మరీ చెప్పి వెళ్లారు. కింద వీడియో చూడవచ్చు.
అయితే అది కాదు ప్రశ్న! సర్వీస్ టాక్స్ దేని మీద ఛార్జ్ చేస్తున్నారు? ఒక ప్లేటు ఇడ్లీ మీద రెస్టారెంట్ ఉన్న స్థలాన్నిబట్టి కూర్చోవటానికి అల్లిన వాతావరణాన్నిబట్టి రకరకాల రేట్లుండవచ్చు. అందులో తప్పు లేదు, మెనూలో ఎంత ఛార్జ్ చేసేది స్పష్టంగా ఉంటుంది కూడా, అందుకు ఇష్టపడి దానికి సిద్ధమైనవాళ్ళే అక్కడ తింటారు. కానీ అదనంగా తగిలించే పన్నుల విషయంలో వాళ్ళు దేని మీద సర్వీస్ టాక్స్ వెయ్యాలి? బిల్లు మొత్తం మీద ఎలా వేస్తారు? బిల్లులో ఇడ్లీ ధర కూడా ఉంది కదా! దాన్ని మినహాయించి నిజంగా వారు అందించిన సేవల మీద కదా సేవా పన్ను ఉంటుంది! అందుకే, సర్వీస్ టాక్స్ రేటు 12.36 అయితే, అందులో 40 శాతం మీదనే సర్వీస్ టాక్స్ వెయ్యవలసి వుంటుంది. అందుకే 12.36 లో 40 శాతం 4.944 శాతం ఛార్జ్ చెయ్యటం జరుగుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం రేటు ఒకేలా ఉండాలి కదా! ఒకే ప్రాంతంలో- ఇక్కడ హైద్రాబాద్ లో చేసిన సర్వేలో కొన్ని రెస్టారెంట్లలో కొన్నిట్లో 4.94 శాతం కొన్నిట్లో 4.95 శాతం కొన్నిట్లో అసలే ఛార్జ్ చెయ్యలేదు, కొందరు సర్వీస్ టాక్స్ తో పాటు సర్వీస్ చార్జ్ అంటూ 5 శాతం అదనంగా ఛార్జ్ చేసారు. పైగా దాన్ని వినియోగదారుల దగ్గర తీసుకోవాలనేమీ లేదు. దాన్ని భరించ వలసింది వ్యాపారులే. కానీ మాకు వచ్చిందంతా ఆదాయం కాదు, అందులో వసూలు చేసిన టాక్స్ కూడా ఉంది అని చూపించటానికే అలా విడివిడిగా చూపిస్తున్నారు కాబట్టి దాన్ని చెల్లించవచ్చేమో కానీ అన్ని చోట్లా రేట్లు ఒకేలా ఉండాలి కదా!
అంటే ఎంత ఛార్జ్ చెయ్యాలన్నది అవగాహన లేకనా లేకపోతే ఎంత చేసినా ఏమీ అడగరనా? బిల్లు కింద థాంక్యూ అని చెప్పటంతో సరిపోతుందా? పైగా విజిట్ అగైన్ అని అంటూ మరోసారి కూడా టోకరా తినమని చెప్పటమా?
సర్వీస్ టాక్స్ వేరు సర్వీస్ ఛార్జ్ వేరు!
సర్వీస్ ఛార్జ్ అంటూ విడిగా బిల్లులో అదనంగా వేస్తున్నప్పుడు టిప్ ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు వెళ్ళిన రెస్టారెంట్ లో అలా ఛార్జ్ చేస్తే దాన్నిసర్వీస్ చేసిన సిబ్బందికి చూపించి టిప్ అందులో ఉందని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి.
మన ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చి అక్కడ కూడా టాక్స్ లు వసూలు చేస్తున్నారని చెప్తుంది. అయితే విదేశాలలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా, అక్కడ ఉన్న ఆదాయం ఇక్కడ ఉందా, అక్కడ ఉన్న ఉపాధి సౌకర్యాలు ఇక్కడున్నాయా? పోలిస్తే అన్ని విషయాల్లో పోల్చి చూడాలి. ఇదంతా తెలియక కాదు కానీ పార్టీలకు ఎన్నికల ఫండ్ కావాలి! అది ఎక్కడి నుండి వస్తుంది? వ్యాపారస్తులు ఇవ్వాలి! వాళ్ళు అలా ఇవ్వటానికి టాక్స్ ముసుగులో వసూలు చేసే ఈ సొమ్ము పనికి వస్తుందని చేసిన వెసులుబాటులా లేదూ?
దీని ప్రభావం పరోక్షంగా అందరి మీదా పడుతోంది! హైద్రాబాద్ లో ఒక మనిషి బయట రెస్టారెంట్ లో తింటూ జీవించాలంటే నెలకు కనీసం రూ.10000 అవుతుంది. ఇక నివాసం, బట్టలు ఇతర ఖర్చులు కలిసి కనీసం రూ.40000 సంపాదించవలసి వస్తుంది. అంత సంపాదించలేకపోతే- అంటే అంత జీతం రాకపోతే మనిషి పక్కదార్లు వెతుక్కుంటాడు. అవినీతి అలాగే మొదలవుతుంది. లేదంటే ప్రత్యామ్నాయం- రోడ్డు పక్కన బండ్లలో దొరికే ఆహారాన్ని తీసుకోవటం!
అందువలన ఏం పోయిందిలే అదంతా ఖర్చుగానే భావిద్దామని అనుకోకండి! అవినీతికి దారితీసే అన్ని విషయాలలోనూ మనం అప్రమత్తతతో మెలిగితేనే అవినీతి అంతమొందుతుంది. ఆడవాళ్ళ దుస్తులు ఆధునికత పేరుతో రెచ్చగొట్టే విధంగా ఉండటం వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనే వాళ్ళు ఈ రకమైన మోసాన్ని కూడా ప్రతిఘటించాలి! ఇలాంటి కన్నుగప్పి చేసే అదనపు వసూళ్ళ వలన జీవనవ్యయభారం పెరిగిపోయి, దాన్ని తట్టుకుంటూ సమాజంలో సముచిత స్థాయిలో జీవనాన్ని సాగించటం కోసం లంచగొండితనం, అవినీతి, బ్లాక్ మెయిలింగ్ లాంటి అక్రమ ఆదాయ వనరులకోసం పాకులాడుతారు!
అందువలన, నేనీ మాత్రం అదనపు సొమ్ముని చెల్లించగలను, నాకు ఇదో పెద్ద లెక్క కాదు, ఇదంతా కలిసే నేను ఈ రోజు ఖర్చు అనుకుంటాను అని కాని, లేదా సమయం లేదు వీళ్ళతో నేను ఇప్పుడు తలపడటం వలన సమయ నష్టం జరుగుతుంది అని అనుకోకండి! ఎందుకంటే ఇది మొత్తం సమాజాన్ని విషమయం చేస్తోంది! టాక్స్ ని సరైన రేటు తో చార్జ్ చేసే సరి, లేదా ఎక్కువ ఛార్జ్ చేస్తున్న పక్షంలో తప్పకుండా కన్సూమర్ ఫోరంలో బిల్లు జతపరుస్తూ ఫిర్యాదు చెయ్యండి. అది మీ కోసం కాకపోవచ్చు కానీ దేశంలో అవినీతిని అంతమొందించటానికి ఏ ఒక్క మార్గాన్నీ మనం మూసెయ్యకపోతే దేశం ఇలాగే అవినీతిలో కూరుకుపోతూనేవుంటుంది. కేవలం రాజకీయ నాయకులను ఆరోపించి ఊరుకోవటం కాదు మనవంతు మనం కూడా చెయ్యాలి కదా!
టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 28 న ఇచ్చిన వార్తా కథనం ప్రకారం ఒకామె అన్నానగర్ చెన్నైలో 71 రూపాయలు అదనంగా వసూలు చేసిన రెస్టారెంటు మీద కన్సూమర్ ఫోరంకి రిపోర్టు చేసారు, దాని మీద ఆమెకు రూ.12000 పరిహారంగా చెల్లించమని కోర్టు ఆదేశించటం జరిగింది.
సర్వీస్ ఛార్జ్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం
లా ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారం చూసుకుంటే అందులో నాలుగు అంశాలుంటాయి. ఆఫర్, యాక్సెప్టెన్స్, డెలివరీ, కన్సిడరేషన్. రెస్టారెంట్ కి వెళ్ళగానే మీ చేతికో మెను కార్డ్ ఇచ్చారనుకోండి. అది రెస్టారెంట్ వాళ్ళు మీకు చేసిన ఆపర్. దాన్ని చూసి మీరు ఆర్డరిచ్చినట్లయితే మీరు ఆ రేట్లకు అంగీకరించినట్లు- యాక్సెప్టెన్స్. మీరు ఆర్డరిచ్చిన పదార్థాలు మీ టేబల్ మీదకు రాగానే డెలివరీ జరిగినట్లు. మీరు వాటి వెలను చెల్లించటం దాని కన్సిడరేషన్. అలా ఇది కాంట్రాక్ట్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. అయితే మిమ్మల్ని చెల్లించమని ఇచ్చే బిల్లులో మెనులో రాసిన రేట్లకంటే ఎక్కువ ఉన్నట్లయితే అది చట్ట విరుద్ధం అవుతుంది. దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more