Anti pepper spray masks in parliament

Anti pepper spray masks in Parliament, Lagadapati Rajagopal, cellphone jammers in parliament, frisking MPs

Anti pepper spray masks in Parliament, Lagadapati Rajagopal

పార్లమెంట్ లో యాంటీ పెప్పర్ స్ప్రే మాస్క్ లు!

Posted: 02/15/2014 12:45 PM IST
Anti pepper spray masks in parliament

పెప్పర్ స్ప్రే ప్రభావం పడకుండా పార్లమెంటులో మాస్క్ లను సభ్యులకు అందుబాటులో ఉంచారు.  సభాపతితో పాటు అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, ఇతర సిబ్దందికి కూడా మాస్క్ లను ఏర్పాటు చేసారు.  లగడపాటి రాజగోపాల్ స్ప్రే చెయ్యటంతో సభలోని సభ్యులు స్పీకర్ తో సహా చాలా మంది అస్వస్థతకు లోనవటం వలన ప్రత్యేకమైన మాస్క్ లను తయారు చేయించిన ప్రభుత్వం వాటి మీద వాటి వెనకనున్న వ్యక్తులను గుర్తుపట్టటానికి వీలుగా వాళ్ళ పేర్లను కూడా ముద్రించింది.

పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకున్న ప్రివిలేజెస్ అన్నీ ఇన్నీ కావు.  సామాన్య మానవుడు వినోదం కోసం సినిమాకు పోయినా, సరుకులు కొనుక్కోవటానికి షాపింగ్ మాల్స్ కి పోయినా తనిఖీ చెయ్యకుండా లోపలికి పోనివ్వరు.  కానీ వివాదస్పదమైన బిల్లుని ప్రవేశపెడుతున్న సమయంలో కూడా, అదే బిల్లు మీద రాష్ట్రంలో రభస జరిగిన దాఖలా ఉన్నా కూడా పార్లమెంటులో వివాదం చెలరేగుతుందనే భయం కానీ పార్లమెంటు సభ్యలకు హాని కలుగుతుందేమో అనే ఆదుర్దా కానీ లేకుండా గందరగోళం మధ్యలోనే రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టటం జరిగింది. 

ఏదో సినిమాలో పెళ్ళి కూతురుకి మత్తు మందిచ్చి, తాళి కట్టే సమయానికి కరెంటు తీసేసి అయిపోయింది అయిపోయిందన్నట్లుంది.  పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాథ్, హోంమంత్రి షిండేలు బిల్లుని ప్రవేశపెట్టటం జరిగిపోయిందని ప్రకటించారు కానీ స్పీకర్ మీరా కుమార్ కాదు ఆ ప్రకటన చేసింది.  

అత్యంత గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులను తనిఖీ చేసే ఆనవాయితీ లేదు.  పార్లమెంటు సభ్యులను సభలో ఫోన్లు చెయ్యవద్దని అంటే ఊరుకోరు కాబట్టి ఫోన్లు పనిచెయ్యకుండా జామర్స్ ని ఉపయోగిస్తారు.  అయినా సెల్ ఫోన్లలో పెద్దలకు మాత్రమే ప్రత్యేకమైన వీడియోలను చూస్తూ కర్నాటక శాసన సభలో మీడియా చేతికి చిక్కిపోయిన సంఘటన వార్తలలో ప్రముఖంగా వచ్చిందోసారి. 

మాస్క్ ల మీద రంగులు కూడా భిన్నంగా ఉంటాయి.  పార్లమెంటు సభ్యులకు, సిబ్బందికి, స్పీకర్ కి ఇచ్చే మాస్క్ ల రంగులు వేరువేరుగా ఉంటాయి.  మీడియా ప్రతినిధులు వాళ్ళ మాస్క్ లు వాళ్ళు తెచ్చుకోవలసిందే.  పార్లమెంటులో సభ జరగటాన్ని సందర్శించటానికి వచ్చే అతిథులకు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని మాస్క్ లు ఇస్తారు.  పార్లమెంటు సభ్యులు మాస్క్ లను తమ వెంట తీసుకుని వెళ్ళిపోవచ్చు- వాటి మీద వాళ్ళ పేర్లుంటాయి కాబట్టి.  పైగా బయటి వరకూ మాస్క్ పెట్టుకుని పోవలసిన అవసరం పడవచ్చు కాబట్టి. 

ప్రత్యేకమైన లోహంతో తయారైన ఈ మాస్క్ లో వెంటిలేటర్ సిస్టమ్ ఉంటుంది.  బ్లూ టూత్ అమర్చి వుంటుంది కనుక వాళ్ళు మాట్లాడితే మైకు లోంచి వాళ్ళ మాటలు బయటకు పోతాయి, వాళ్ళ చెవులకు ఇతరుల మాటలు వినిపిస్తాయి. 

బిల్లు ఎందుకు పెట్టామా అని తలపట్టుకుంటారు అని ముందుగా హెచ్చరించినవాళ్ళ విషయంలో వాళ్ళ పక్కనే మార్షల్స్ ని సిద్ధంగా ఉంచే ఏర్పాటు కూడా జరిగింది.  దీనితోపాటుగా మిరియాల పొడిని సెన్స్ చేసే సెన్సార్స్ ని అమర్చి వాటిని ఎగ్జాస్ట్ చేసే మెకానిజంతో పాటు సైరన్ మోగే విధానాన్ని ఏర్పాటు చెయ్యటానికి చర్చలు జరుగుతున్నాయి.

అంతే కాదు, మాస్క్ ల తయారీలో మూజువాణీ ఓటింగ్ లో ఏ, నే అన్నప్పుడు ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లను చెయ్యాలనుకుంటున్నారు ఎందుకంటే పార్లమెంటులో సంక్షోభం ఉన్నప్పుడే బిల్లులను చకచకా పాస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles