Babu view on ap capital

chandrababu naidu, ap capital, vijayawada, vishakapatnam, ap districts, rayalaseema, railway junction, it companies, it jobs, government jobs, infrastructure, latest news, ap assembly

chandrababu announced ap as capital for andhrapradesh : babu planning to develope total state with infrastructure and develope capital

ఏపీ రాజధాని నిర్మాణం ఎలా? చంద్రబాబు వ్యూ(హం) ఏమిటి?

Posted: 09/04/2014 05:57 PM IST
Babu view on ap capital

ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చింది. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అటు ప్రతిపక్షం కూడా బాబు ప్రతిపాదనను అంగీకరించింది. విజయవాడ సరైన నిర్ణయమే అని సభలో అంతా బల్లలు చరిచారు. భూముల లభ్యత కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే విజయవాడ సమీపంలో ఎటు వైపు రాజధాని ఉంటుందనే విషయం మాత్రం చెప్పకుండా దాటవేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది. నిర్మాణంపై చంద్రబాబుకు ఉన్న వ్యూహాలు ఏమిటి? ఇప్పుడీ ప్రశ్నలు అందరి మదిలో, మెదడులో తొలుస్తున్నాయి.

భూ సేకరణ బుగులు

రాజధాని ఏర్పాటుకు ముందుగా కావల్సింది భూముల లభ్యత. విజయవాడ కేంద్రంగా రాజధాని ఏర్పాటవుతుందని విభజనకు ముందే జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భూములను రాజకీయ నేతలు, బడా బాబులు కొనేశారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటనతో మిగతా భూములను కొనేపనిలో ఉన్నారు. ఇక రియల్ భూం డబ్బు కట్టలతో రెక్కలు విప్పి పాగా వేసింది. దీంతో ఇప్పుడు విజయవాడ పరిసరాల్లో కొనేందుకు ప్రభుత్వానికి భూములు ఎక్కడా ఖాళీగా లేవు. మరోవైపు విస్తారంగా పంటలు పండే ఈ ప్రాంతంలో భూములు అమ్మేందుకు రైతులు కూడా సిద్ధంగా లేరు. ఒకందుకు ఇది భవిష్యత్ లో దుష్పరిణామంగా మారే ప్రమాదముంది. ఎకరం భూమి కోట్ల రూపాయలు పలుకుతుండగా ప్రభుత్వానికి కావాల్సిన వేల ఎకరాల భూమి కోసమే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో భూమిని కాకుండా ప్రభుత్వ భూములనే వాడుకోవాలంటే కృష్ణా-గుంటూరు జిల్లా పరిసరాల్లో అటవీ, అసైన్డ్ భూముల లభ్యత తక్కువగా ఉంది. ఈ భూములు కావాలంటే మళ్ళీ ప్రకాశం జిల్లాకు వెళ్లక తప్పదు. ఆ ప్రాంతంలో ఉన్న కొద్ది పాటి అటవీ భూములను డీ నోటిఫై చేసి వాటిని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా రాజధాని ఏర్పాటు చేయటం మాత్రం కష్టం అవుతుంది. దీంతో ప్రధానమైన సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు వంటి కీలక కేంద్రాలను మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసే వీలుంది.

కార్యాలయాల వికేంద్రీకరణ

భూ లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే హైదరాబాద్ మాదిరిగా అన్ని కార్యాలయాలు ఒకే చోట కాకుండా రాజధాని పరిసర ప్రాంతమంతా ప్రభుత్వ కార్యాలయాలను విస్తరించనుంది. ఒక ప్రాంతాన్ని రాజకీయ రాజధాని (అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ ) చేసి మిగతా ప్రాంతంలో  శాఖల ప్రధాన కార్యాలయాలు, హైకోర్టు, ఇతర విభాగాలను ఏర్పాటు చేసే అవకాశముంది (ఉదా. గన్నవరం రాష్ర్ట రాజధాని ప్రకటిస్తే ప్రధాన కార్యాలయాలను నూజివీడు, గుంటూరు లేదా మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేయవచ్చు). ఇలా అయితే భూముల లభ్యతతో పాటు జన రద్దీ తగ్గుతుంది. దీనికి తోడు నీటి లభ్యత సమస్య తక్కువగా ఉంటుంది. పరిపాలన కూడా కొన్ని జిల్లాలకు విస్తరించినట్లవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అటు సులభంగా చేరుకునేందుకు మెట్రో రైళ్లు, కొత్త రైల్వే లైన్ల ద్వారా ప్రాంతాల మద్య రవాణా సమయం తగ్గిస్తున్నారు.

లక్షల కోట్ల ఖర్చు

ఇక రాజధాని నిర్మాణమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ ఖర్చు కేంద్రమే భరిస్తుందని విభజన చట్టం చెప్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం సుమారు రూ.4లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. ఒకే బడ్జెట్ లో ఇంత మొత్తం ఒక రాష్ర్టానికి కేటాయించటం అంటే అసాద్యం. కాబట్టి పదేళ్ళలో దశల వారిగా ఈ మొత్తాన్ని కేటాయించనుంది. ఈ లోగా తాత్కాలిక రాజధాని నుంచి పాలన చేసే ఏపీ ప్రభుత్వం నిర్మాణాలకు అనుగుణంగా కొత్త భవనాల్లోకి మారిపోనుంది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నిధులు రాబట్టుకుని వేగంగా కొత్త క్యాపిటల్ నిర్మించుకోవాలని బాబు భావిస్తున్నారు. ఇందుకోసమే అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది.

పరిపాలన విభజన, వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బాబు రాజధానిని ఎంపిక చేశారు. శివ కమిటీ వద్దని చెప్తున్నా.., తన పరిపాలనా అనుభవంపై ఉన్న నమ్మకంతో విజయవాడను ఎంచుకున్నారు. మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి జిల్లాకు స్మార్ట్ సిటీని ఎంపిక చేసి వరాలను కురిపించారు. గీసుకున్న ప్లాన్, వేసుకున్న స్కెచ్ పక్కాగా అమలు చేస్తున్న చంద్రబాబు.., ఏపీ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap capital  vijayawada  latest news  

Other Articles