టెలివిజన్ ప్రేక్షకుడికి పరిచయం చేయనక్కర్లేని పేరు ఆయనది. తొలితరం సీరియల్ నటుల్లో చెరిగిపోని స్థానం ఆయనది. నటుడిగా, దర్శకుడిగా పలు అవార్డులను దక్కించుకున్న ప్రతిభ ఆయనది. ఆయనే ‘జీడిగుంట శ్రీధర్ ’. పాతికేళ్లుగా తనదైన నటనాశైలితో అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న శ్రీధర్, తన నట ప్రస్థానం గురించి ఇలా చెబుతున్నారు...
ఈ మధ్య తక్కువ కనిపిస్తున్నారు ?
అదేం లేదు. రకరకాల బాధ్యతల కారణంగా మూడు నెలలుగా గ్యాప్ వచ్చిందంతే. అంతకుముందు కొత్త బంగారం, ఇద్దరమ్మాయిలు లాంటి సీరియల్స్ చేశాను.
సినిమాలకు పూర్తిగా దూరమయ్యారెందుకు ?
మొదట్నుంచీ అంత మోజు లేదు. భారత్ బంద్, పీపుల్స్ ఎన్‌కౌంటర్, కిల్లర్ లాంటి కొన్ని సినిమాలు చేశాను. ఎంతసేపూ హీరో ఫ్రెండ్‌గా చేయమంటే ఆసక్తి లేక వదిలేశాను. అయినా అప్పట్లో కొత్త వాళ్లకు అవకాశాలు అంతగా ఉండేవి కాదు.
నటనవైపు ఎలా వచ్చారు ?
నాన్న (రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి) ఆలిండియా రేడియోలో పనిచేసే వారు. నాతో అప్పుడప్పుడూ నాటకాలు వేయించేవారు. దాంతో ఆసక్తి ఏర్పడింది. దూరదర్శన్ వచ్చాక మొదటి కమర్షియల్ నాటకంలో చేసే అవకాశం దక్కింది. అలాగే మొదటి సీరియల్ ‘ఆగదు ఉద యం’లోనూ నటించాను. ఇప్పటివరకూ ఐదు వేలకు పైగా ఎపిసోడ్లలో నటించాను.
దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు కదా ?
అనేక వాణిజ్య ప్రకటనలు, డాక్యుమెంటరీలు తీశాను. రైల్వే, జీహెచ్‌ఎమ్‌సీ, ఆర్టీసీ వంటి పలు ప్రభుత్వ సంస్థల డాక్యుమెంటరీలు కూడా చేశాను. మొదట ‘ఆగదు ఉదయం’కి అసిస్టెంట్ డెరైక్టర్‌ని. దర్శకుడిగా మారింది మాత్రం ‘పునరపి జననం’తో. దానికి చాలా నంది అవార్డులు వచ్చాయి. నా షార్ట్ ఫిల్మ్ ‘పరివర్తన’కు కూడా నంది వచ్చింది.
కానీ ఇప్పుడెందుకు డెరైక్షన్ చేయట్లేదు ?
ఆంధ్రాబ్యాంక్‌లో ఇరవై ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. ఓ పక్క ఉద్యోగం, మరోపక్క కుటుంబం, ఇంకో పక్క నటన... ఇన్ని బాధ్యతల మధ్య దర్శకత్వానికి కాస్త బ్రేక్ పడింది. ఓ మంచి సబ్జెక్ట్ మనసులో ఉంది. త్వరలోనే దాన్ని తెరకెక్కిస్తాను.మీరు వచ్చినప్పటికీ,
ఇప్పటికీ ఫీల్డ్‌లో వచ్చిన మార్పులేంటి ?
అప్పట్లో ఒక ఎపిసోడ్ మూడు రోజులు తీసేవారు. ఇప్పుడు మూడు ఎపిసోడ్లు ఒకే రోజు తీసేస్తున్నారు. మితిమీరిన వేగం వల్ల క్వాలిటీ దెబ్బతింటోంది. షాట్ బాలేదు, ఇంకోసారి చేస్తామని అడిగినా దర్శకుడు వద్దంటున్నాడు. అలాగే మేము ప్రామ్టింగ్ తీసుకునేవాళ్లం కాదు. ఇప్పటి వాళ్లు కనీసం సీన్ ఏమిటో, ఏం డైలాగులు చెప్పాలో కూడా తెలుసుకోకుండా కెమెరా ముందుకొచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ మార్పు అంత మంచిది కాదు.
మరి విలువల మాటేమిటి ?
అవి ఎప్పుడో మారిపోయాయి. ఒకప్పుడు ఒక సీరియల్‌గానీ, టెలిఫిల్మ్‌గానీ తీయా లంటే మంచి కథ కోసం చూసేవాళ్లం. రచయితలను సంప్రదించేవాళ్లం. మంచిది దొరికితేనే చేసేవాళ్లం తప్ప కాంప్రమైజ్ అయ్యేవాళ్లం కాదు. కానీ ఇప్పుడంత శ్రద్ధ ఎవరు తీసుకుంటున్నారు! అవే కథలు, అవే పగలూ ప్రతీకారాలూ. మంజులా నాయుడి సీరియల్స్ మాత్రమే కాస్త భిన్నంగా అనిపిస్తాయి.
ఇలా అయితే నటుడిగా తృప్తి దొరుకుతుందా ?
అందుకేగా మంచి పాత్రలు ఎంచుకుని చేసేది! ‘తులసీదళం’లో చేసిన పాత్ర నాకు చాలా ఇష్టం. అలాగే ‘పద్మవ్యూహం’లోనిది కూడా. యువకుడిగా ఎంటరై తండ్రిగా, తాతగా కూడా చేశాను. ఆ పాత్రకి నందితో పాటు పదిహేను అవార్డులు తీసుకున్నా. అలాంటి పాత్రలొస్తేనే చేస్తున్నా.
నాన్నగారిలా రచయిత కావాలనుకోలేదా ?
ట్రై చేశాను. నావల్ల కాదనిపించింది. నటుడు, దర్శకుడన్న పేర్లు చాలు. అయితే నాకు చదువంటే ఇష్టం. అందుకే థియేటర్ ఆర్ట్స్ చేశాను. గోల్డ్‌మెడల్ సాధించాను. టెలివిజన్ జర్నలిజం కూడా చేశాను.మీ అన్నయ్య పిల్లలు (వరుణ్ సందేశ్, వీణా సాహితి) ఫీల్డ్‌లోకి వచ్చారు.
మరి మీ పిల్లలు?
బాబు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆపై అమెరికా వెళ్తానంటున్నాడు. పాపకి కూడా సినిమాలపై ఆసక్తి లేదు. అన్నయ్యకు సిని మాలంటే ఇష్టం కనుక పిల్లల్ని అటు పంపా లనుకున్నాడు. నా పిల్లలు వెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్లకే ఇష్టం లేదు.
పాతికేళ్ల కెరీర్ మీకేమిచ్చిందంటే ఏం చెప్తారు ?
అన్నీ ఇచ్చింది. మంచి పాత్రలు చేశాను. మంచి పేరు సంపాదించాను. అయితే ఇదంతా నా గొప్పదనం కాదు. నా ఫ్యామిలీ, ఆంధ్రాబ్యాంకు వారి సపోర్ట్ లేకపోతే నేనీ స్థాయిలో ఉండేవాడిని కాదు. అయితే ఇంకో కోరిక మిగిలేవుంది. ప్రముఖ నవలల్ని సీరియల్స్‌గా తీయాలనుకుంటున్నాను. అది కూడా చేసేస్తే ఇక అన్నీ పొందనట్టే !
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more