ఎప్పటిలాగానే పరమశివం హడావిడిగా ఆఫీసులోకి వచ్చాడు. లోపల అడుగు పెడుతూనే అతని దృష్టి ఎకౌంట్స్ లో ఏదో వెతుకుతున్న ఎకౌంటెంట్ నరసింహాచారి మీద పడింది. వేగాన్ని తగ్గించకుండానే, "ఏమిటి చారి గారూ వెతుకుతున్నారు?" అని అడిగాడు. వెతుకుతున్నది ఆపి ఎకౌంటెంట్ చారి, "ఇన్ కంటాక్స్ ఫైలు సార్ ... " అన్నాడు. "ఏమిటి ఇన్ కం టాక్స్ ఫైలే కనపడటం లేదా. అంత అజాగ్రత్తయితే ఎలా?" అని ఆ కోపంలో ఇంకా వేగంగా నడుచుకుంటూ తన కేబిన్ లోకి పోయాడు పరమ శివం.
తన సీటులో కూర్చున్న తర్వాత కూడా పరమ శివం చిటపటలాడుతూనే ఉన్నాడు. అతని రాకకు ముందే ఎసి ఆన్ చెయ్యకపోతే కాబిన్ చల్లబడటానికి టైం పడుతుంది కదా అని పది నిమిషాల ముందే ఎసి ఆన్ చేస్తాడు అటెండర్. అలా చెయ్యకపోయినా కోపమే, చేస్తే అనుమానం ఎంతసేపటి నుంచి ఎసి వేసుకుని కూర్చున్నాడో అని.
ఇంటర్ కమ్ ఆన్ చేసి "ఎకౌంటెంట్ ని పంపించ"మని చెప్పాడు. తలుపులు మీద నెమ్మదిగా కొట్టి లోపలికి వచ్చాడు ఎకౌంటెంట్ చారి. ఈలోపులో ఫాక్టరీకి ఫోన్ చేసి ప్రొడక్షన్ వివరాలు అడిగాడు.
"రా మెటీరియల్ లేదు సార్..."
"ఏమిటీ రా మెటీరియల్ లేదా. అయితే మెషీన్లన్నీ బజ్జుని ఉన్నాయన్నమాట ఇలాగైతే ఎలాగయ్యా?" అంటూ పర్చేజ్ విభాగానికి ఫోన్ చేసాడు
"ఏమిటి రా మెటీరియల్ లేదట. మెషీన్లని ఖాళీగా పెడితే కంపెనీ ఎలా నడుస్తుంది?" అని గద్దించాడు.
"మెటీరియల్ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు సర్. మనం వాళ్ళకి సమయానికి బాకీ చెల్లించలేదు. లేటుగా ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందట....".
"చెక్ బౌన్సా నాన్సెన్స్ అని తలెత్తి ఎకౌంటెంట్ నిచూసి ఏమిటి చెక్కులు బౌన్స అవుతున్నాయట?" అని అడిగాడు.
"పోయిన నెలలో కలెక్షన్స్ రాలేదు సర్."
"ఏం చేస్తున్నారు సేల్స్ స్టాఫంతా తిండి దండగ మనుషులు. వాళ్ళ జీతాల వరకైనా కలెక్షన్లు చేస్తున్నారా అదీ లేదా?" అన్నాడు. చారి మాట్లాడలేదు..
"అవునూ ఇంతకీ ఆ ఇన్ కం టాక్స్ ఫైలేమయింది?"
"వెతుకుతున్నా సర్."
"వెతకటమేమిటండీ. జాగ్రత్తగా పెట్టొద్దూ. అరగంటలో ఆ ఫైలు నా టేబుల్ మీదుండాలి అన్నాడు పరమశివం" శివాలెత్తుతూ.
అరగంటలో ఆ ఫైలు వచ్చినా పరమశివానికి దానితో పనేమీ లేదు. పనున్నది నరసింహాచారికే, వెతుకున్నదీ అతనే.
అలా పొద్దుటినుంచీ సాయంత్రం వరకూ అరిచినవాడు అరిచినట్టే ఆఫీసంతా గగ్గోలు పెట్టి అందరినీ ఉరుకులు పెట్టించిన పరమ శివం అలా వారం రోజులు పనిచేసేసరికి హాస్పిటల్ లో చేర్చాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు.
రక్తపోటుతో పాటు మరికొన్ని ఆధునిక వ్యాధులను అతనిలో కనుగొన్న డాక్టర్లు అతన్ని వారం రోజులు విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించారు.
వారం అనుకున్నది పదిరోజులయింది. మళ్ళీ ఆఫీసుకి వెళ్ళాడు పరమ శివం.
వ్యాపారం ఎంత అధోగతిలోకి పోయిందో అని భయపడుతూ రిపోర్టులు అడిగి తెప్పించుకున్నాడు. అవి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అతని తండ్రి ఏర్పరచిన వ్యాపార సంస్థది. అందులో పనిచేసేవారంతా అనుభవఙులు. అంతా సవ్యంగా సాగుతోంది. ఎవరి పనులు వారు చేస్తున్నారని తెలుస్తోంది అది చూస్తే. తను లేకపోయినా బాగానే సాగిందే!
తను లేకపోబట్టే బాగా సాగిందని అర్థమైంది. తను కంగారు పడి, పని చేస్తున్నవాళ్ళని అనవసరంగా కంగారు పెట్టి, తనకి తెలియని విషయాల్లో అనవసరంగా ఆదుర్దా చూపించి గందరగోళాన్ని సృష్టించినవాడు తనే అని అర్థమైంది.
సరిగ్గా ఇలాగే జరుగుతుంది మన శరీర వ్యవస్థలో. శరీరంలోపలి భాగాలకు అవేం చెయ్యాలో వాటికి తెలిసినంతగా మనకి తెలియదు. అంతా సవ్యంగా సాగుతున్నంత కాలం ఏదీ మన దృష్టికి రాదు. ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం జరిగినప్పుడే మన దృష్టికి వస్తుంది. అందుకే ఆరోగ్యం కనపడదు. అనారోగ్యం మాత్రమే కనిపిస్తుంది. శరీరంలోపల పనిచేసే ప్రధానాంగాలకు మనమేమీ చెప్పనక్కరలేదు. అవే చూసుకుంటాయి. వాటిని మనం తయారు చెయ్యలేదు. వాటికి మనం ఎటువంటి శిక్షణా ఇవ్వలేదు.
అవి చూసుకోలేని స్థితికి వచ్చినప్పుడు మనమేమీ చెయ్యలేము, ఎవరూ ఏమీ చెయ్యలేరు. మందులు ఇచ్చనా, బాడీ రిజెక్ట్ చేస్తోంది అంటారు డాక్టర్లు. మన శరీరంలోని ప్రాణ శక్తి సజావుగా అన్ని భాగాలకూ సరఫరా అవుతున్నంత కాలం వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. మనం మానసికంగా కుంగిపోయినప్పుడు మాత్రం అవి తమ పనులను వదిలిపెట్టి దృష్టంతా మనమీద పెట్టాల్సివస్తుంది.
మన దృష్టి శరీరంలో ఏ ప్రాంతానికి పోతుందో అక్కడికి మనలోని ప్రాణశక్తి ప్రవహిస్తుంది. అందుకే నొప్పి కలిగి మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ భాగానికి విశ్రాంతి నివ్వాలో ఉపచారాలు చెయ్యాలో మన పరిధిలోని పని చెయ్యటం కోసమే నొప్పి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం చెయ్యవలసింది అంతవరకే కానీ బాధపడటం మన పని కాదు. బాధ అనుభవించటం వేరు, బాధ పడటం వేరు. అనుభవం భౌతికమైనది. బాధపడటం మానసికం. ఆకలి వెయ్యటం అనే క్షద్బాధ తెలియటం వలనే శరీరానికి మనం ఆహారాన్ని అందిస్తున్నాం. దాహం తెలియటం వలనే నీటిని లోపలికి పంపుతున్నాం. అలా మనం చెయ్యవలసిన పనులు మనం చేస్తే చాలు.
శరీరం ఒక క్రమబద్ధమైన వ్యవస్థ. దానిలో లోపాలు తలెత్తి మన దృష్టికి వచ్చినపుడు దాన్ని అర్థం చేసుకోవటమే మనం చెయ్యవలసింది. పరీక్షలు చేసే ఒక వైద్యుడిలా ఎక్కడ నొప్పి ఉందో కనిపెట్టి దానికి బయటనుంచి ఏం చెయ్యాలో అది చేసి ఊరుకోవాలంతే. ఇది నా శరీరం అన్న మమకారమే బాధ పడేట్టుగా చేస్తుంది.
అందుకే ఒక మానసిక వైద్యుడు దీవిస్తూ, "మీకు ఏ వ్యాధీ సోకకుండుగాక. మీకు ఏ బాధా కలుగకుండు గాక" అంటూనే, "మీ శరీరానికి సోకితే పరవాలేదు. మీ శరీరానికి బాధ కలిగితే పరవాలేదు" అన్నాడట.
ఆహారపానీయాలూ, విశ్రాంతి లాంటివి కాకుండా ఇంకా మనం తీసుకోవలసిన జాగ్రత్తలను మన పూర్వీకులు మనకు తెలియజేసారు. శరీరంలో సున్నితమైన వత్తడిని కలుగజేయటం ద్వారా ప్రాణశక్తి సంచారం జరిగి అక్కడి ప్రధానమైన అంగాలకు శక్తి పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దానిమీద ఆధారపడి కొన్ని ఆసనాలు, శ్వాసతో కూడిన ప్రాణాయామ శిక్షణలు మనకిచ్చారు. అవి చేస్తూ ఆహార పానీయాల నియమాలు పాటిస్తే చాలు. ప్రకృతి నుంచి "దీర్ఘాయుష్మాన్ భవ" అనే ఆశీర్వాదాలను పరిపూర్ణంగా పొందినట్టే.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more