చిన్నప్పటి నుండి చదువు అబ్బని శక్తి (నాని) కి జీవితంలో లక్ష్యాలంటూ ఏమీ ఉండవు. శ్రుతి (వాణీ కపూర్ ) తన చదువు పూర్తయ్యాక బిజినెస్ చేసి బాగా సంపాదించి తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. శ్రుతి వెడ్డింగ్ ప్లాన్ బిజినెస్ ఆలోచిస్తుంది. అందులో నన్ను కూడా పాట్నర్ ని చేసుకోమని అడిగితే కాదనలేక ఓకే అంటుంది. ఇద్దరు కలిసి ‘గట్టి మేళం ’ అనే ఆపీస్ ని ఫ్రారంభించి మెల్లి మెల్లిగా చాలా పెద్దగా ఎదుగుతారు. ఈ క్రమంలో శక్తి శ్రుతితో లవ్ లో పడతాడు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు శారీరకంగా కలుస్తారు. ఆ సంఘటన శక్తి చాలా లైట్ గా తీసుకున్నా, శ్రుతి మాత్రం అతనితో పూర్తిగా లవ్ లో మునిగి పోతుంది. శక్తి ప్రవర్తలో మార్పు రావడంతో ఇద్దరూ విడిపోయి గట్టి మేళం అప్పుల్లో కూరుకుపోతుంది. మళ్లీ ఇద్దరూ కలిసి దానిని ఎలా సక్సెస్ చేస్తారు, ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేధాలు ఎలా క్లియర్ చేసుకుంటారనేది వెండితెర పై చూడాల్సిందే.
ఇటీవలి కాలంలో పరభాషల్లో (హిందీ, తమిళ) విడుదల అయ్యి హిట్టయిన సినిమాల్ని తెలుగులో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. ఇవాళ కూడా నాని నటించిన ఆహా కళ్యాణం సినిమా కూడా అలాంటిదే. హిందీలో హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘బ్యాండ్ బాజా బారాత్’ని తమిళ వెర్షన్లో రీమేక్ చేసి, తెలుగులో డబ్ చేశారు. ఎందుకంటే ఇది వరకే ఈ సినిమాను నందినీ రెడ్డి ‘జబర్థస్త్ ’ లో కాపీ కొట్టారు.
ఎలాగు రీమేక్ సినిమానే కదా అని మక్కీకి మక్కీ దించేస్తే సరిపోతుందని అనుకున్నాడు దర్శకుడు. కానీ ఏ భాష నేటి విటీకి తగ్గట్లు ఆ భాషలో కాస్తన్ని చేర్పులు చేసి విడుదల అయిన ‘ఆహా కళ్యాణం ’ సినిమా జనాలు ‘ఓహో ’ అనే విధంగా ఉందో లేక అసహ్యించుకునేలా ఉందో ఈ సినిమా రివ్య్వూ ద్వారా చూద్దాం.
ఇటీవల నాని నటించిన పైసా సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నాని ఫర్ఫామెన్స్ తో సినిమాను నడిపించాడు. నేడు విడుదల అయిన ఆహా కళ్యాణం లో కూడా నాని తన నటనతో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. తమిళ వెర్షన్ గా రీమేక్ చేసిన ఈ సినిమాను దర్శకుడు ఒరిజినల్ సినిమాను ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయకుండా కథనంతా ఒకే మూడ్ లో సాగుతుంది.
ఎలాంటి ట్విస్టులూ, గందరగోళాలూ లేవు. ఎక్కడి నుండి సినిమాను చూసిన ఈజీగా అర్ధం అవుతుంది. క్లయిమాక్స్‌లో ఏం జరుగుతుందనేది ఇంటర్వెల్ సీన్‌లోనే ఊహించేయవచ్చు. నిజానికి ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. ఎక్కువ భాగం తమిళంలో తీశారు. తెలుగులో డబ్ చేశారు. అందుకే లిప్ సింక్ చాలా సందర్భాల్లో మ్యాచ్ కాలేదు. నాని తప్ప తెలిసిన మొహం ఒక్కటీ లేదు.
నాని తాను ఉన్న ప్రతి సీన్‌లోను ఏదోటి చేసి సినిమాని షోల్డర్ చేయడానికి చూసాడు. అతడిని అభిమానించే వారు ఈ చిత్రానికి పాస్ మార్కులు వేసేయవచ్చు. కానీ టోటల్‌గా కంటెంట్‌ని చూసుకుంటే మాత్రం ఏదో వెలితి వెంటాడుతుంది. ఇప్పటికే హిందీలో చూసిన వారు, జబర్థస్త్ చూసిన వారు ఈ సినిమాతో కంపేరిజన్ చేసుకోకుంటే యావరేజ్ గా అనిపిస్తుంది.
గత సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల కానీ నాని సినిమాలు ఈ సంవత్సరం వరుసగా విడుదల అవుతున్నాయి. ఆ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారా లేదా అన్నది ప్రక్కన పెడితే నటన పరంగా నాని ప్రతి సినిమాలో నటనలో మాత్రం ఇరగ దీస్తున్నాడు. ఏ పాత్రనైలోనైనా ఇట్టే ఇమిడిపోయే నాని ఈ సినిమాలో తాను చెప్పిన బట్లర్ ఇంగ్లీష్ డైలాగులు ప్రేక్షకులకి కడుపుబ్బా నవిస్తాయి.
ఇటీవలే పెళ్ళయిన నాని ఆ సినిమాలో వచ్చే లిప్ లాక్ కిస్, బెడ్ సీన్‌లో తన అనుభవాన్నంతా రంగరించి చేసి రక్తికట్టించాడు. నాని సరసన నటించిన వాణీ కపూర్ ఈ పాత్రలో కాస్తంత ఎక్కువ చేసి నటించినట్లు అనిపించినా, ఆ పాత్రకు సూటయ్యేలా చేసింది. ఒరిజినల్ సినిమాలో అనుష్క శర్మ నటించిన దానితో పోలిస్తే కాస్తంత తక్కువే అని చెప్పాలి. చాలా కాలం తరువాత తెలుగు తెర పై కనిపించిన సిమ్రాన్ ఫర్వాలేదనిపించింది. ఫ్లోరిస్ట్ క్యారెక్టర్‌లో బడవ గోపి పర్‌ఫార్మెన్స్ బాగుంది. ఇక మిగిలిన వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.
సాంకేతిక వర్గం :
మొదటి నుండి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఫుల్ పబ్లిసిటీ చేసిన ఈ చిత్రానికి సంగీతం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. దరన్ కుమార్ అందించిన సంగీతం వినసొంపుగా లేదు. తమిళంలో రీమేక్ చేసిన ఈ సినిమా పాటలను తెలుగులో డబ్ చేసే సరికి కాస్తంత ఇరిటేషన్ తెప్పిస్తాయి. కెమెరా వర్క్ చాలా నీట్ గా ఉంది. ఎడిటర్‌కి పెద్ద గా పని పడలేదు. ఎందుకంటే సినిమా అంతా ఫ్లాట్‌గా సాగిపోయింది. యష్‌రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చెప్పేదేముంది. నిర్మాణ విలువల్లో లోపాలేం లేవు. సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు.
దర్శకుడు గోకుల్ క్రిష్ణ రాసిన ఒకట్రెండు డైలాగులు ఆకట్టుకొంటాయి. అలసిపోయి ఇంటికొస్తే టీ ఇస్తా - అలసిపోకుండా వస్తే అలసిపోయేలా చేస్తా అనేది కాస్త పచ్చిగా ఉంది. ఒరిజినల్‌కి కథకు మార్పు చేర్పులు చేయడానికి సాహసించలేదు. హిందీలో ఎలా ఉందో అలానే తీశాడు. కానీ ఆ కథను సరిగా హ్యాండిల్ చేయడంతో కాస్తంత తడబడ్డాడు. దీంతో ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదనిపిస్తుంది.
చివరగా : ‘ఆహా కళ్యాణం ’ ‘ఆహా ఓహో ’ అనే విధంగా లేదు.